హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టును కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డే అడ్డుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మెట్రో విస్తరణకు అవసరమైన ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నప్పటికీ, కిషన్ రెడ్డి తన సహచర కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి కుట్ర పన్ని ఆ రుణం మంజూరు కాకుండా నిలిపివేయించారని పేర్కొన్నారు. జపాన్ నుండి వచ్చిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందకుండా చేస్తూ తెలంగాణపై వివక్ష చూపుతోందని సీఎం విమర్శించారు.
మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు దాదాపు రూ.40 వేల కోట్లు అవసరమవుతాయని, ఆ ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక భాగస్వామ్యం లేకపోయినా పర్వాలేదని, కేవలం నిరాక్షేపణ పత్రం (NOC) ఇస్తే చాలని తాము కోరినట్లు వెల్లడించారు. అయితే ఈ సమస్యలపై చర్చించడానికి సమయం ఇవ్వాలని అడిగినా కిషన్ రెడ్డి స్పందించడం లేదని, అహ్మదాబాద్, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు ఇచ్చిన కేంద్రం, హైదరాబాద్ మెట్రో విషయంలో మాత్రం కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నాయని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి పూర్తిగా బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్‌ల డైరెక్షన్‌లో నడుచుకుంటూ వారికి లొంగిపోయారని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా మెట్రోను నిర్మించలేదని, ఇప్పుడు తాము ఆ లోపాలను సరిచేసి నగరానికి మేలు చేయాలని చూస్తుంటే వివిధ రూపాల్లో అడ్డంకులు కల్పిస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.









