తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి అవినీతి తిమింగలాలపై పంజా విసిరారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న బలమైన ఆరోపణలతో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో విస్తృతంగా సోదాలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలను చేపట్టాయి. హైదరాబాద్‌లోని చత్రినాకలో ఉన్న నరహరి ప్రధాన నివాసం, ఆయన అధికారిక కార్యాలయంతో పాటు ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న మరో 11 ప్రాంతాలలో (మొత్తం 13 చోట్ల) అధికారులు జల్లెడ పడుతున్నారు. తన అధికారిక ఆదాయ వనరులకు మించి నరహరి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు వచ్చిన పక్కా సమాచారంతోనే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, భూ సంబంధిత కీలక శాఖల్లోని అధికారుల అక్రమాలపై ఏసీబీ ప్రత్యేక నిఘా ఉంచిన తరుణంలో ఈ సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని, సోదాలు పూర్తిగా ముగిసిన అనంతరం నరహరి ఇళ్లలో లభించిన అక్రమాస్తుల విలువ, స్వాధీనం చేసుకున్న నగదు, బంగారంతో పాటు కీలక భూ పత్రాల పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.









