రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (TPS) బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై పాఠశాలను ప్రారంభించి, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం తక్కువ అనే భావనను తల్లిదండ్రులు వదిలేయాలని ఆయన కోరారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ బడులను తీర్చిదిద్ది, మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. విద్యపై ప్రభుత్వం భారీగా పెట్టుబడి పెడుతోందని, అందుకోసమే బడ్జెట్లో రూ. 27 వేల కోట్లను కేటాయించామని వెల్లడించారు.
గతంలో కులం పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వేర్వేరుగా ప్రత్యేక పాఠశాలలు పెట్టి వివక్ష చూపారని, అది సమాజంలో కుల వ్యవస్థను మరింత ప్రోత్సహించిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అలాంటి కుల వివక్షను నిర్మూలించే ఉద్దేశంతోనే, పిల్లలందరూ కలిసి చదువుకునేలా తమ ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల’ (Young India Integrated Residential Schools) నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని ప్రకటించారు. విద్యను కేవలం ఖర్చుగా కాకుండా సమాజ భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడిగా చూడాలని ఆయన సూచించారు. ప్రభుత్వ బడులలో చదివిన ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, చివరకు తానే స్వయంగా ముఖ్యమంత్రిగా ఎదిగానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ఈ పబ్లిక్ స్కూళ్ల ప్రధాన ఉద్దేశమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి విద్యార్థికి ఆధునిక విద్యను అందిస్తూ వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేందుకే ‘విద్యా కమిషన్’ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని కూడా ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. క్రీడల్లో స్ఫూర్తిని నింపడానికి అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీని హైదరాబాద్కు ఆహ్వానించే ప్రయత్నం చేస్తే కొందరు విపక్ష నేతలు విమర్శలు చేయడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు సమాజ హితం కోసం జరుగుతున్నాయని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ సంస్కరణలు అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.








