సాయికృష్ణ మిస్సింగ్ కేసు: ఇది పోలీసుల లాకప్ డెత్.. శవాన్ని మాయం చేశారు – అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న విజయవాడ రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణలంక సీఐ నాగరాజుపై ఇప్పటికే ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ, ఈ కేసులో పోలీసుల ప్రమేయంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తి అదృశ్యమైన కేసు కాదని, పోలీసులే అతడిని లాకప్ డెత్ చేసి, ఆపై శవాన్ని కూడా మాయం చేశారంటూ ప్రెస్‌మీట్‌లో సంచలన ఆరోపణలు గుప్పించారు.

సాయికృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నామనే మాటల్లో వాస్తవం లేదని, అతడు ప్రస్తుతం బతికే లేడని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదేశించిన సీనియర్ ఐపీఎస్ అధికారి విచారణపై తమకు ఎలాంటి నమ్మకం లేదన్నారు. “గ్యాంగ్ వార్‌లోనే సాయికృష్ణ ఏమైపోయాడో తెలియకుండా పోయాడు” అని పోలీసులు ముందే రాసుకున్న స్క్రిప్ట్‌ను మాత్రమే ఈ విచారణ నివేదికలో చూపిస్తారని ఎద్దేవా చేశారు. ఈ ఉదంతంపై పూర్తి నిజాలు నిగ్గు తేలాలంటే తక్షణమే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని, అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు సాయికృష్ణ కుటుంబ సభ్యులు సైతం పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సీఐ నాగరాజు తన కుమారుడిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, చంపేస్తామంటూ ముందే బెదిరించారని సాయికృష్ణ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. సాయికృష్ణను స్టేషన్‌లోనే కొట్టి చంపేసి, ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా లోపాయికారీగా అతడి శవాన్ని మాయం చేసేశారంటూ బాధితుడి మేనమామ నేరుగా ఆరోపించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు