తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన కీలక కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీ ముగిసిన అనంతరం భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వానాకాలం రైతు భరోసా నిధులను ఈ నెల 30న (జూన్ 30, 2026) విడుదల చేయాలని కేబినెట్ ఖరారు చేసింది. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించబోయే ‘రైతు సమ్మేళనం’ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారని ఆయన స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా మార్కెట్ డిమాండ్ తగినట్లుగా 7 రకాల సన్న వడ్లకు ప్రత్యేక బోనస్ అందించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుండి తక్కువ ధాన్య సేకరణ చేయడం సరికాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి అవసరమైన ఎరువుల కోటా, రామగుండం యూరియాలో సింహభాగం కేటాయింపులు సాధించడంతో పాటు, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అనుమతులు, ఐఆర్ఎఫ్ సీ (IRFC) రుణాల విడుదల వంటి కీలక అంశాలపై చర్చించేందుకు త్వరలోనే తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లనుందని ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధి కోసం తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు సైతం కలిసి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
రైతు సంక్షేమంతో పాటు విద్యార్థులకు కూడా కేబినెట్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 21న దేశవ్యాప్తంగా జరగబోయే నీట్ (NEET) పరీక్షకు హాజరయ్యే తెలంగాణ విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హాల్ టికెట్ చూపించి విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. వీటితో పాటు, ప్రభుత్వ పాలనలో పారదర్శకతను, వేగాన్ని పెంచేందుకు వీలుగా రానున్న రోజుల్లో అంతా ‘డిజిటల్ కేబినెట్’ విధానాన్ని నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.









