ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గురువారం నాడు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “దేశ సర్వోన్నత చట్టసభ అయిన పార్లమెంట్‌పై దాడి చేసిన వ్యక్తులకు, అదే పార్లమెంట్లో సభ్యుడిగా (ఎంపీగా) ఉన్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని థర్డ్ డిగ్రీతో దారుణంగా వేధించిన వారికి మధ్య పెద్ద తేడా ఏముంది?” అని సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధిపై ఇలాంటి అరాచక చర్యలకు పాల్పడటం అత్యంత తీవ్రమైన విషయమని కోర్టు మండిపడింది.
ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు వేధింపులకు గురిచేయబోతున్నారనే విషయం సునీల్ కుమార్ నాయక్‌కు ముందే తెలుసని హైకోర్టు అభిప్రాయపడింది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అయి ఉండి, ఇలాంటి అక్రమ ఉదంతాల్లో భాగస్వామి కాకుండా తనను తాను నియంత్రించుకోవాల్సిన కనీస బాధ్యత లేదా అని నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమికంగా ఆధారాలు కనిపిస్తున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక ఎంపీపై కస్టోడియల్ టార్చర్ వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ముందస్తు బెయిల్ రక్షణగా మారకూడదని కోర్టు తేల్చిచెప్పింది.
విచారణ సమయంలో హైకోర్టు జడ్జి పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి ‘మీ క్లయింట్ ఎప్పటిలోగా పోలీసుల ఎదుట సరెండర్ అవుతారు?’ అని ప్రశ్నించారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొనసాగిస్తారా? లేక చట్టాన్ని గౌరవించి స్వచ్ఛందంగా వెళ్లి లొంగిపోతారా? అనేది తేల్చుకోవాలని ఆదేశించారు. దీనిపై నిందితుడి తరఫు లాయర్ స్పందిస్తూ.. కోర్టు అడిగిన ప్రశ్నలపై తమ క్లయింట్‌తో సంప్రదించి తదుపరి నిర్ణయాన్ని న్యాయస్థానానికి తెలియజేస్తామని చెప్పారు. కేసుకు సంబంధించిన మరికొన్ని కీలక అంశాలను కోర్టు ముందు ఉంచుతామని కోరడంతో, హైకోర్టు ఎలాంటి తుది తీర్పు ఇవ్వకుండా ఈ కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.









