ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత చేపట్టిన సింగరేణి ‘బాయిబాట’ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వేడిని రగిల్చింది. ఈ సందర్భంగా ఆమె స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును లక్ష్యంగా చేసుకుని అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కార్మికులకు, మాకు మధ్య రావాలని చూస్తే ఖబద్దార్.. గతంలో చేసిన తప్పులకే నిన్ను వెంటబడి ఓడించాం, మళ్లీ అదే పునరావృతమైతే వచ్చే ఎన్నికల్లోనూ నిన్ను వెంటాడి మరీ ఓడిస్తాం” అంటూ మంత్రి శ్రీధర్ బాబుకు కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ పర్యటనలో భాగంగా కవిత అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు అండర్‌గ్రౌండ్ మైన్‌లోకి స్వయంగా దిగి, నల్లబొగ్గు బావుల్లో కార్మికులు పడుతున్న ప్రాణసంకట కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఒక కార్మికుడు తన ఇబ్బందులను వివరిస్తుండగా ఆమె తీవ్ర చలనానికి లోనై గని లోపలే కంటతడి పెట్టారు. అనంతరం నిర్వహించిన భారీ గేట్ మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థకు దాదాపు రూ. 50 వేల కోట్ల బకాయిలు పెట్టి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి దోపిడీ వ్యవస్థను నడిపిస్తూ, మెషినరీని అప్‌గ్రేడ్ చేయకుండా కార్మికుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.
తాను సింగరేణి కార్మికులను కలవకుండా ఉండేందుకు గత నాలుగు రోజులుగా పోలీసులు ఆంక్షలు పెడుతూ అడ్డుకుంటున్నారని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్ మీటింగ్‌కు వస్తే కార్మికుల జీతాలు కట్ చేస్తామని యాజమాన్యం బెదిరించడం దుర్మార్గమని, ఒక్క కార్మికుడి జీతం కట్ చేసినా తాను గని ముందే ధర్నాకు కూర్చుంటానని హెచ్చరించారు. రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో హెచ్ఎంఎస్ (HMS) ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కార్మిక శ్రేణులకు పిలుపునిచ్చారు.








