అన్నదాత సుఖీభవ: రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్ల వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన కంప్యూటర్ బటన్ నొక్కి 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లను నేరుగా జమ చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా రూ.7,000 చొప్పున ఆర్థిక సాయం అందింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి, అంతకుముందు వ్యవసాయ, ఉద్యానవన శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. రైతులు, మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ప్రాసెసింగ్ యూనిట్లు, వర్మీ కంపోస్టు తయారీ, నూనె గింజల మిషన్ వంటి వివిధ ప్రదర్శనల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఎం కిసాన్ పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించిన కార్యక్రమాన్ని స్థానిక రైతులతో కలిసి ముఖ్యమంత్రి వీక్షించారు.

ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా కడప, కర్నూలు జిల్లాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్లు 2026 డిసెంబరు నాటికి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ భారీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు ఇతర ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు