తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులలో సరికొత్త ధోరణి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే యాత్రికులలో యువతులు, అందులోనూ జెన్-జీ (Gen-Z) తరం అమ్మాయిలు పెద్ద సంఖ్యలో ఉంటున్నారని ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘రెడ్‌బస్’ విడుదల చేసిన తాజా డేటా వెల్లడించింది. రాష్ట్రం నుంచి తిరుపతికి బస్సు టికెట్లు బుక్ చేసుకున్న మొత్తం మహిళా ప్రయాణికులలో 30 ఏళ్లలోపు వారు 48 శాతంగా నమోదు కావడం విశేషం. సాధారణంగా పెద్దవయసు వారే ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారనే సంప్రదాయ భావనను మారుస్తూ ఈ సరికొత్త ట్రెండ్ దూసుకొచ్చింది.
తిరుమలలో నిర్వహించిన జ్యేష్ఠాభిషేకం ఉత్సవాల నేపథ్యంలో తిరుపతికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే జూన్ 20తో ముగిసిన వారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి తిరుపతికి బస్సు బుకింగ్‌లు 22 శాతం వృద్ధి చెందాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతికి వెళ్లే మొత్తం ప్రయాణికులలో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువత వాటా 47% గా రికార్డయింది. తెలంగాణ నుంచి యాత్రలు ప్రారంభించేవారికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నిలవగా.. ఎంజీబీఎస్, కూకట్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ప్రయాణికులు అత్యధికంగా బస్సులు ఎక్కుతున్నారు.
ఈ సరికొత్త జనరేషన్ ప్రయాణికులు ప్రయాణంలో సౌకర్యానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో మొత్తం బుకింగ్స్‌లో 65 శాతం ఏసీ బస్సులు కాగా, 58 శాతం మంది స్లీపర్ సర్వీసులను ఎంచుకున్నారు. సాధారణంగా దేశవ్యాప్తంగా తీర్థయాత్రలు చేసేవారిలో పురుషుల వాటా (సుమారు 65-69 శాతం) అధికంగా ఉంటుంది. కానీ, తెలంగాణకు సంబంధించిన తాజా గణాంకాలు ఆధ్యాత్మిక యాత్రల్లో యువతుల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని స్పష్టం చేస్తున్నాయి. యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే సంప్రదాయ వేడుకల పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నారో ఈ మార్పు నిరూపిస్తోంది.









