సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. పోలీస్ కస్టడీలో మరణించిన సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో ప్రధాన నిందితుడైన సీఐ నాగరాజుకు మరో ముగ్గురు వ్యక్తులు సహకరించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రాథమికంగా గుర్తించింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఆ ముగ్గురిని ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు మరియు ఒక సీఐ సన్నిహితుడిగా సిట్ అధికారులు నిర్ధారించారు.
సిట్ నివేదిక ప్రకారం అశోక్, జంగం నాని అనే ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లతో పాటు సీఐ సన్నిహితుడు సురేశ్ ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఇందులో అశోక్ అనే హెడ్‌కానిస్టేబుల్ సీఐ నాగరాజుకు వ్యక్తిగత అసిస్టెంట్‌గా వ్యవహరించగా, జంగం నాని సీఐ పేరు చెప్పుకొని ప్రైవేట్ సెటిల్మెంట్లు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పలు అక్రమాల కారణంగా పీఆర్‌కు వెళ్లిన జంగం నానికి ఇటీవలే కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో పోస్టింగ్ లభించడం గమనార్హం.
ప్రస్తుతం ప్రధాన నిందితుడైన సీఐ నాగరాజు అరెస్ట్ అనంతరం ఈ ముగ్గురు నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లారు. వారి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో వారి ఆచూకీ కనుగొనడం సిట్ అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. మరోవైపు ఈ కేసుపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత స్పందిస్తూ, సాయికృష్ణ కేసులో దర్యాప్తు అత్యంత పారదర్శకంగా కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.









