‘ఇడుపు కాయితం’ టైటిల్ వివాదం: తెలంగాణ యాసపై గరికపాటి వ్యాఖ్యలు వైరల్

ప్రియదర్శి, జానపద గాయని నాగదుర్గ ప్రధాన పాత్రల్లో వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సుకుమార్ రైటింగ్స్ మరియు బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర పోస్టర్ విడుదలైనప్పటి నుండి ఆంధ్రా, తెలంగాణ నెటిజన్ల మధ్య భాషాపరమైన వివాదం రాజుకుంది. కోస్తాంధ్రకు చెందిన కొందరు నెటిజన్లు ఈ పేరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, “ఇది తెలుగేనా? సినిమాకు సబ్‌టైటిల్స్ కావాలి” అని ట్రోల్ చేయగా, తెలంగాణ భాషాభిమానులు తమ సంస్కృతిని అవమానించడమేనని గట్టిగా తిప్పికొడుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గతంలో తెలంగాణ మాండలికంపై చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ భాష అత్యంత శాస్త్రీయమైనదని, వ్యాకరణబద్ధంగా గ్రాంథికానికి ఎంతో దగ్గరగా ఉంటుందని స్పష్టం చేశారు. బ్రిటీషర్ల ప్రభావం సర్కారు జిల్లాలపై ఎక్కువగా ఉండి అక్కడి భాష రూపాంతరం చెందిందని, కానీ తెలంగాణ ప్రాంతంలో ఆంగ్ల ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ప్రాచీన తెలుగు మూలాలు అలాగే భద్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్న వ్యాఖ్యలను తెలంగాణ నెటిజన్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

భాషా నిపుణుల సమాచారం ప్రకారం ‘ఇడుపు కాయితం’ (లేదా ఇడుసు కాగితం) అనేది అచ్చమైన తెలంగాణ గ్రామీణ వాడుక పదం. గతంలో కోర్టుల చుట్టూ తిరగకుండా గ్రామీణ ప్రాంతాల్లో పెద్దల సమక్షంలో భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోయేటప్పుడు రాసుకునే సంప్రదాయ విడాకుల ఒప్పంద పత్రాన్ని ‘ఇడుపు కాయితం’ అని పిలుస్తారు. ఒక సినిమా టైటిల్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉండే సాంస్కృతిక, మాండలిక వైవిధ్యం మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు