వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో దేశ యువతదే కీలక పాత్ర అని, విద్య మరియు సాధికారతే వారికి ప్రధాన ఆయుధాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మంగళవారం నాడు విశాఖపట్నంలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (Central Tribal University of Andhra Pradesh) తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, మన గిరిజన సంస్కృతి మరియు వారసత్వానికి యువత పునరుజ్జీవం తీసుకురావాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
ఈ విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవంలో పట్టాలు పొందిన విద్యార్థులలో దాదాపు 40 శాతం మంది, స్వర్ణ పతకాలు సాధించిన వారిలో 70 శాతం మంది అమ్మాయిలే కావడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. ఇది మహిళా సాధికారతకు, లింగ సమానత్వం పట్ల విద్యాసంస్థకున్న నిబద్ధతకు నిదర్శనమని ఆమె ప్రశంసించారు. గిరిజన విశ్వవిద్యాలయాలు కేవలం విద్యా కేంద్రాలుగా మిగిలిపోకుండా.. గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు విధాన రూపకల్పనకు ప్రధాన కేంద్రాలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
వేగంగా మారుతున్న ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు పుస్తక పరిజ్ఞానంతో పాటు, పరిసరాల నుంచి ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్రపతి విద్యార్థులకు హితవు పలికారు. అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, చిరుధాన్యాలు, ఎకో-టూరిజం వంటి స్థానిక నైపుణ్యాలను ప్రోత్సహించేలా వర్సిటీల్లో నూతన ఆవిష్కరణలు జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఉత్తరాంధ్ర గిరిజన తెగల సాధికారత కోసం ఈ విశ్వవిద్యాలయం ‘సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్’ను నిర్వహిస్తూ.. ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, ఆహార భద్రత వంటి కీలక అంశాలపై దృష్టి సారించడం అభినందనీయమని కొనియాడారు.









