అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఐటీ నిపుణుడు వెంకటేష్ దొప్పలపూడి (33) దుర్మరణం పాలయ్యాడు. బాపట్ల జిల్లా దేవరపల్లి గ్రామానికి చెందిన ఆయన, కాన్సస్ రాష్ట్రంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. హెచ్-1బీ వీసాపై అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకటేష్ మరణంతో ఆయన స్వగ్రామంలోనూ, ప్రవాస భారతీయ (ఎన్నారై) సమాజంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
గత శనివారం మధ్యాహ్నం వెంకటేష్ హ్యూస్టన్ నగరం నుండి నెబ్రాస్కాలోని ఒమాహాలో ఉన్న తన నివాసానికి కారులో బయలుదేరాడు. మార్గమధ్యంలో కాన్సస్‌లోని సమ్నర్ కౌంటీ వద్ద భారీ వర్షాల కారణంగా రోడ్లపైకి ఆకస్మికంగా వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక వంతెన సమీపంలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అత్యవసర సేవల అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ వెంటనే రంగంలోకి దిగినప్పటికీ, వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది. ఆ తర్వాత పోలీసులు డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో రాత్రంతా తీవ్రంగా గాలించి, ఆదివారం ఉదయం వెంకటేష్ మృతదేహాన్ని వరద నీటి నుండి బయటకు తీశారు. ప్రస్తుతం హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తోంది. అలాగే బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ‘గోఫండ్‌మీ’ ద్వారా నిధుల సేకరణ కూడా ప్రారంభించారు.









