పాలనపై బహిరంగ చర్చకు సిద్ధం.. తేదీ, సమయం చెప్పండి: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. కాంగ్రెస్ ప్రస్తుత పాలన, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆయన.. ఈ చర్చకు సంబంధించిన తేదీ, సమయం, వేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా ఖరారు చేయాలని డిమాండ్ చేశారు.

ఇటీవల రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గడువులో సగం కాలం పూర్తయినా చెప్పుకోవడానికి ఒక్క విజయం కూడా లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం వంటి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులు వచ్చాయని, వరి సాగు 26 లక్షల హెక్టార్ల నుండి 59 లక్షల హెక్టార్లకు పెరిగిందని గుర్తు చేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే గత ప్రభుత్వంపై నిందలు వేస్తోందని ఆరోపించారు.

అసెంబ్లీ, ప్రెస్ క్లబ్ లేదా జూబ్లీహిల్స్ ప్యాలెస్.. వేదిక ఏదైనా చర్చకు తాను వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు. “ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో సహా నిరూపించడంలో నేను విఫలమైతే, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను” అంటూ కేటీఆర్ ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు