నా బిడ్డ మరణాన్ని వాడుకున్నారు.. పవన్ కల్యాణ్ పై పోలీసులకు సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తన కుమార్తె మరణాన్ని పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని, తమకు నమ్మక ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు. పవన్‌పై చీటింగ్, నమ్మకద్రోహం, నిందితులతో కుమ్మక్కవడం వంటి అంశాలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

 

అధికారంలోకి రాగానే తొలి సంతకం సుగాలి ప్రీతి కేసు విచారణ ఫైలుపైనే చేస్తానన్న పవన్, ఇప్పుడు మాట మార్చారని పార్వతీ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలు, డీఎన్‌ఏ లేవంటూ నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. న్యాయం అడిగితే జనసేన కార్యకర్తలను ఉసిగొల్పి తనపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

 

2017లో కర్నూలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించగా, కరెస్పాండెంట్ కుమారులు ఆమెపై అత్యాచారం చేసి చంపేశారని తల్లిదండ్రులు పోరాడుతున్నారు. గతంలో పవన్ కల్యాణ్ వీరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ తనకు న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పార్వతీ దేవి.. డిప్యూటీ సీఎంపైనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు