షాబాద్ ఘోరకలి: రంగారెడ్డి జిల్లా హత్యలపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఆరుగురి కిరాతక హత్యల ఉదంతంపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్న మంత్రి, ఘటనకు సంబంధించిన వివరాలు తెలియగానే తక్షణమే స్పందించారు. రంగారెడ్డి జిల్లా పోలీస్ కమిషనర్‌తో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు సేకరించిన ఆమె, నిందితుడిపై అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసు దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఈ ఘోర విపత్తులో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు, వారికి మానసిక-సామాజిక తోడ్పాటు (Psycho-social support) కల్పించాల్సిందిగా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇటువంటి కిరాతక నేరాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఆమె తీవ్రంగా హెచ్చరించారు.

పోక్సో కేసు కక్షతోనే ఆరుగురి నరమేధం: పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఈ ఘోర హత్యల వెనుక పాత కక్షలు ఉన్నట్లు తేలింది. నిందితుడు రాజ్‌కుమార్ (28) గతంలో ఒక మైనర్ బాలికను వేధించినందుకు గాను, ఆ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మే నెలలో అతనిపై పోక్సో (POCSO) కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవల శుక్రవారం బెయిల్‌పై విడుదలైన నిందితుడు, కక్షతో ఊగిపోతూ తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నానమ్మలను కత్తితో నరికి చంపాడు. అంతటితో ఆగకుండా, తన సొంత భార్య సరితతో పాటు కేవలం 3 ఏళ్లు, 2 ఏళ్ల వయసున్న తన ఇద్దరు బిడ్డలను కూడా కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు