రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్‌ఎస్ రక్తదానం: సిద్దిపేటలో ఉద్రిక్తత

రైతుల పంట పొలాల్లో కెసిఆర్, హరీష్ రావుల రక్తం చల్లాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేటలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టాయి. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో “రేవంత్ రక్త దాహర్తికి మా రక్త దానం” అనే పేరుతో బిఆర్‌ఎస్ నాయకులు పాల సాయిరాం, ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తమ రక్తంతో రైతుల కష్టాలు తీరుతాయంటే రక్తం చిందించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు.

ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని దాదాపు 20 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ రక్తం ప్యాకెట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పంపిస్తామని బిఆర్‌ఎస్ శ్రేణులు స్పష్టం చేశాయి. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాకే ఇలాంటి అసందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ రక్తాన్ని ఆయన పంట పొలాలలో చల్లుకోవాలంటూ మీడియా సమక్షంలో తీవ్రంగా దుయ్యబట్టారు.

తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని బిఆర్‌ఎస్ నాయకులు కొండం సంపత్ రెడ్డి, కాముని శ్రీనివాస్ తదితరులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నీటి సరఫరా గురించి ప్రశ్నించిన వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు నీరందించాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బిఆర్‌ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని వారు హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు