తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర విషాదం: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య!

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం (డీజీపీ ఆఫీస్) లో గురువారం తెల్లవారుజామున ఒక తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న స్వామి అనే సిబ్బంది తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. అత్యంత భద్రత ఉండే డీజీపీ కార్యాలయంలోనే ఈ ఘటన జరగడంతో ఉన్నతాధికారులు సైతం షాక్‌కు గురయ్యారు.

పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ స్వామి బుధవారం రాత్రి పూట విధుల్లో (నైట్ డ్యూటీ) ఉన్నారు. గురువారం తెల్లవారుజామున దాదాపు 5:30 గంటల సమయంలో ఆయన కార్యాలయంలోని వాష్‌రూమ్‌లోకి వెళ్లి, తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో తలపై కాల్చుకున్నారు. గుండు నేరుగా దూసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావమై స్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దం విని తోటి సిబ్బంది అక్కడికి పరుగున రాగా, స్వామి అప్పటికే మరణించి ఉన్నారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఈ ఘటనకు సంబంధించి కానిస్టేబుల్ స్వామి రాసిన ఆత్మహత్య లేఖను (సూసైడ్ నోట్) పోలీసులు ఆయన డైరీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. “నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా భార్య, పిల్లలను ఎవరూ ఏమీ అనొద్దు.. వాళ్లు చాలా మంచివాళ్లు. నేను చనిపోయిన తర్వాత దెయ్యంగా మారైనా సరే నా కుటుంబాన్ని, పిల్లలను జాగ్రత్తగా కాపాడుకుంటాను” అని స్వామి తన డైరీలో రాసుకున్న ఆఖరి మాటలు అందరినీ తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు