రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వెంటనే తన వద్ద ఉన్న విద్యాశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు డిమాండ్ చేశారు. ‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసి నైతికతను చాటుకున్నారని గుర్తుచేసిన ఆయన, తెలంగాణలో రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు నిరుద్యోగ భృతి చెల్లించకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. యువత సమస్యలను గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం క్యాండిల్ ర్యాలీలు చేయడం హాస్యాస్పదమని, ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనల వెనుక విదేశీ హస్తం ఉందంటూ విమర్శించారు.
అలాగే 21 ఏళ్లకే యువతకు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాంచందర్రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల వయోపరిమితిని మార్చే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పరిధిలో లేని అధికారాల గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నిరుద్యోగులను, యువతను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, కాంగ్రెస్ పార్టీ చేసిన నిరసనల వల్లే కేంద్రం దిగివచ్చిందనడంలో ఎలాంటి నిజం లేదని రాంచందర్రావు కొట్టిపారేశారు. రాష్ట్రంలో విద్యా రంగాన్ని, నిరుద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.









