దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల ఆర్థిక స్థితిగతులు, వారిపై ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలను ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్’ (ADR) సంస్థ తాజాగా వెల్లడించింది. వీరి ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ. 8,660 కోట్లుగా తేలింది. ఈ జాబితాలో ప్రజా ప్రతినిధుల ఆర్థిక పురోగతితో పాటు వారిపై పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ నివేదిక ప్రకారం అత్యధిక ఆస్తులు కలిగిన టాప్-3 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులే నిలిచారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ రూ. 1,413 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రూ. 931 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో, తమిళనాడు సీఎం విజయ్ రూ. 648 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ. 30 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే 8వ స్థానాన్ని కైవసం చేసుకోగా, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కేవలం రూ. 55 లక్షల ఆస్తులతో దేశంలోనే అత్యంత సామాన్యమైన ఆర్థిక నేపథ్యం కలిగిన సీఎంగా నిలిచారు.
మరోవైపు ముఖ్యమంత్రులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను కూడా ADR స్పష్టం చేసింది, మొత్తం 31 మందిలో 14 మందిపై కేసులు ఉన్నట్లు తేలింది. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 80 కేసులతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు अधिकारी 29 కేసులతో రెండో స్థానంలో ఉండగా, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మరియు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చెరో 19 కేసులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.









