రేపటితో ముగియనున్న దరఖాస్తుల గడువు తెలంగాణలో ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)-2026 దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ పరీక్షకు హాజరుకావాలనుకునే అర్హులైన అభ్యర్థులు రేపటిలోపు ఆన్లైన్లో తమ దరఖాస్తులను, పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని టెట్ కన్వీనర్ రమేష్ సూచించారు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులకు ఎలాంటి అవకాశం ఉండబోదని, చివరి రోజుల్లో సర్వర్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ముందుగానే ప్రక్రియ ముగించాలని అధికారులు స్పష్టం చేశారు.
ఇప్పటివరకు 16,042 మంది దరఖాస్తు.. తప్పుల సవరణకు అవకాశం ఈ ప్రత్యేక టెట్-2026 పరీక్ష కోసం ఇప్పటివరకు మొత్తం 16,042 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించిన అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అవకాశం కల్పించారు. దరఖాస్తులో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు లేదా ఇతర సమాచారంలో ఏవైనా పొరపాట్లు దొర్లితే, వాటిని సవరించుకునేందుకు (ఎడిట్ ఆప్షన్) ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇచ్చారు.
సెప్టెంబర్ 7 నుంచి పరీక్షలు ప్రారంభం ఈ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (TG TET) సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనున్నారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల ఉద్యోగాల పదోన్నతుల్లో టెట్ అర్హత అత్యంత కీలకమైనది కావడంతో, అర్హులైన టీచర్లు గడువులోగా దరఖాస్తు పూర్తి చేసి పరీక్షకు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.









