ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ఎవరితోనైతే పెట్టుకోకూడదో, సరిగ్గా ఆ ‘జెన్ జెడ్’ (Gen Z) యువతతోనే పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశారని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇటీవల ఢిల్లీ వేదికగా యువత చేసిన పోరాటాన్ని ప్రస్తావిస్తూ… ఇది ఒకవైపు ‘వాట్సాప్ అంకుల్స్’, మరొకవైపు ‘ఇన్స్టాగ్రామ్ పిల్లల’ మధ్య జరిగిన హోరాహోరీ యుద్ధంలా సాగిందని, ఇందులో చివరికి ఇన్‌స్టా పిల్లలే గెలిచారని కేటీఆర్ అభివర్ణించారు.
యువత నుంచి వచ్చిన ఈ తీవ్రమైన డిజిటల్ నిరసనలు, ఒత్తిడిని తట్టుకోలేక కేంద్ర పాలకులకు ఏం చేయాలో పాలుపోలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందువల్లే దేశ ప్రధాని సైతం అర్ధరాత్రి వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా ఒక వీడియో రిలీజ్ చేసి దేశ యువతకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అనే ఒక శక్తివంతమైన ఆయుధం గనుక లేకపోతే రాజకీయ నాయకులలో జవాబుదారీతనం అనేది వచ్చేదే కాదని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
నేటి తరం 18 నుండి 24 ఏళ్ల మధ్య వయసున్న యువత సంప్రదాయ పద్ధతుల్లో సుదీర్ఘమైన వార్తాపత్రికలు చదవడం లేదా టీవీలు చూడటం లేదని కేటీఆర్ వెల్లడించారు. వారు కేవలం రీల్స్, షార్ట్ వీడియోల రూపంలోనే దేశ రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ పూర్తి అవగాహన పెంచుకుంటున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో దేశంలో 50 శాతానికి పైగా ఓటర్లు ఈ జెన్ జెడ్ యువతే ఉంటారని, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న ఈ యువతను తక్కువగా అంచనా వేస్తే రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వానికైనా తిప్పలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు.









