టాలీవుడ్ ప్రముఖులు దగ్గుబాటి వెంకటేశ్, సురేశ్ బాబు, రానాలతో పాటు అభిరామ్‌లకు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్మ్‌నగర్‌లోని ‘డెక్కన్ కిచెన్’ ప్రాపర్టీ వివాదంలో నాంపల్లి కోర్టులో తమపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ (Quash) దగ్గుబాటి కుటుంబం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్. తుకారాంజీ కొట్టివేశారు. ఈ పిటిషన్‌లో ఎలాంటి బలమైన కారణాలు లేవని స్పష్టం చేస్తూ, కేసు విచారణను నాంపల్లి కోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించారు.
లీజు గడువు ముగియకుండానే దగ్గుబాటి కుటుంబం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి తమ ప్రాపర్టీలోకి అక్రమంగా ప్రవేశించి, నిర్మాణాలను కూల్చివేసి బెదిరింపులకు దిగారంటూ గతంలో కోరె నందు కుమార్ కేసు నమోదు చేశారు. ఇది కేవలం లీజుకు సంబంధించిన సివిల్ వివాదమని నిందితుల తరఫున వాదించినప్పటికీ, హైకోర్టు జోక్యం చేసుకునేందుకు తిరస్కరిస్తూ నాంపల్లి కోర్టులోనే విచారణ కొనసాగేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.









