సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ సెన్సార్ పూర్తి.. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ విడుదల కానుంది. సస్పెన్స్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా కలబోతగా వస్తున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికెట్‌ను పొందింది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్‌హిట్ చిత్రంతో ప్రశంసలు అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో సూర్య ‘సంజయ్ విశ్వనాథ్’ అనే 40 ఏళ్ల అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రలో కనిపిస్తుండగా, ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించింది. సీనియర్ నటీనటులు రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలరించబోతోందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. జి.వి. ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు