నగరంలో చెరువులను సందర్శించిన కర్ణాటక బృందం…
హైదరాబాద్ నగరంలో ఆక్రమణలను తొలగించి, చెరువుల పునరుద్ధరణ కోసం నిరంతరం కృషి చేస్తూ హైడ్రా తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని, నగరంలో చెరువులను సందర్శించిన కర్ణాటక బృందం .. చెరువుల పునరుద్ధరణ అద్భుతం అంటూ కితాబిచ్చారు.
ఆక్రమణలు తొలగించి చెరువులను పునరుద్ధరించడం గొప్ప పరిణామం అని కర్ణాటక బృందం హైడ్రాను కొనియాడింది. చెరువుల పునరుద్ధరణ పనులు ఎలా జరుగుతున్నాయని కర్ణాటకలోని బెంగళూరును సందర్శించిన హైడ్రా.. నెలల్లోనే మెరుగైన పనితీరుతో హైదరాబాద్‌లో ఫలితాలు సాధించిందని అభినందించారు. బతుకమ్మకుంట, కూకట్‌పల్లి నల్లచెరువుతో పాటు నగరంలో మొదటివిడతగా హైడ్రా పునరుద్ధరించిన పలు చెరువులను కర్ణాటకలోని వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది. అనంతరం హైడ్రా కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలిసి చెరువుల పునరుద్ధరణలో ఎదురైన సవాళ్లను.. వాటిని అధిగమించిన తీరును అడిగి తెలుసుకున్నారు. బెంగళూరులోని చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ జరుగుతున్న తీరును పరిశీలించిన హైడ్రా.. అనతి కాలంలోనే మేము ఇక్కడకు వచ్చి చూసేలా చెరువులను పునరుద్ధరించారు. బతుకమ్మకుంటను చూశాం.. ఆక్రమణలకు గురై.. నాడు ముళ్ల పొదలతో ఉన్న చిత్రాలను, వీడియోను చూశాం.. నేడు అక్కడ నయనమనోహర దృశ్యం కనిపించింది. ఆక్రమణలు తొలగించి ఏకంగా చెరువును సృష్టించిన తీరు.. అద్భుతం అనిపించింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసినా.. వరద ముంచెత్తలేదని స్థానికులు చెప్పిన విషయాన్ని, కర్ణాటక బృందం సభ్యులు కమిషనర్‌కు తెలిపారు. ఇదే పరిస్థితి మిగతా చెరువుల చెంత ఉందని కొనియాడారు. బెంగళూరు నగర మాజీ మేయర్, చెరువులను పునరుద్ధరణలో భాగస్వామ్యం అయిన అధికారులు, కాంట్రాక్టర్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సాంకేతిక బృందంతో సభ్యులు నగరంలో హైడ్రా పునరుద్ధరించిన చెరువుల సందర్శనలో పాల్గొన్నారు.









