అమెరికా శాంతి ప్రతిపాదనకు ఇరాన్ నో: ‘బెదిరింపుల మధ్య చర్చలు ఉండవు’.. బుధవారంతో ముగియనున్న కాల్పుల విరమణ!

శాంతి ఆశలపై నీళ్లు చల్లిన ఇరాన్..

పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. అమెరికాతో రెండో విడత చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ సోమవారం స్పష్టం చేసింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం చర్చల కోసం పాకిస్థాన్ చేరుకోనున్న తరుణంలో ఇరాన్ ఈ ప్రకటన చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అగ్రరాజ్యం తీరును ఎండగట్టిన ఇరాన్, గత అనుభవాల నుంచి అమెరికా పాఠాలు నేర్చుకోవడం లేదని విమర్శించింది.

బెదిరింపులు – దౌత్యంపై ఇరాన్ ఆగ్రహం..

ఒకవైపు శాంతి చర్చలంటూనే, మరోవైపు తమ ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా స్పందించారు. అమెరికాకు దౌత్యంపై కనీస సీరియస్‌నెస్ లేదని, బెదిరింపులకు దిగుతూ చర్చలకు పిలవడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. జాతీయ ప్రయోజనాల విషయంలో ఇరాన్ ఎటువంటి హెచ్చరికలకు తలొగ్గబోదని, బెదిరింపుల నీడలో చర్చల ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తేల్చి చెప్పారు.

యుద్ధం దిశగా పశ్చిమాసియా?

ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు వారాల కాల్పుల విరమణ గడువు ఈ బుధవారంతో ముగియనుంది. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరిగిన మొదటి విడత చర్చలు ఇప్పటికే ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. తాజా ప్రతిష్టంభన నేపథ్యంలో గడువు ముగిసిన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధం ఏ స్థాయికి చేరుకుంటుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా శాంతి ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు