అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ ‘లేడీ డాన్’ అరెస్ట్: ఇరాన్ నుంచి సుడాన్‌కు ఆయుధాల స్మగ్లింగ్.. అసలెవరీ షమీమ్ మాఫీ?

విమానాశ్రయంలో అధికారులకు చిక్కిన సూత్రధారి..

అమెరికాలో ఉంటూనే ఇరాన్ నుంచి సుడాన్‌కు అక్రమంగా డ్రోన్లు, బాంబులు మరియు మందుగుండు సామాగ్రిని సరఫరా చేస్తున్న ఇరానియన్ సంతతి మహిళా వ్యాపారవేత్త షమీమ్ మాఫీని అమెరికా భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. శనివారం రాత్రి లాస్ ఏంజిలస్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX)లో ఆమె ఇస్తాంబుల్ వెళ్లే విమానం ఎక్కబోతుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 44 ఏళ్ల షమీమ్, అమెరికా గ్రీన్ కార్డ్ కలిగి ఉండి కాలిఫోర్నియాలోని ఉడ్‌ల్యాండ్ హిల్స్‌లో నివసిస్తోంది. ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ అంతర్జాతీయ ఆయుధ స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఎట్టకేలకు బట్టబయలైంది.

ఒమన్‌ కేంద్రంగా కోట్లాది డాలర్ల దందా..

షమీమ్ మాఫీ ఒమన్‌ కేంద్రంగా ‘అట్లాస్ ఇంటర్నేషనల్ బిజినెస్’ అనే సంస్థను నడుపుతూ, ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు మరియు సుడాన్ సాయుధ దళాలకు మధ్య మధ్యవర్తిగా పనిచేస్తున్నట్లు అమెరికా అటార్నీ బిల్ ఎస్సాయ్‌లీ వెల్లడించారు. ముఖ్యంగా ఇరాన్ తయారీ ‘మొహాజెర్-6’ సాయుధ డ్రోన్ల సరఫరా కోసం ఆమె సుమారు 70 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 580 కోట్లు) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. 2023 నుంచి సుడాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం కోసం 55,000 బాంబు ఫ్యూజ్‌లను, లక్షలాది రౌండ్ల మందుగుండు సామాగ్రిని టర్కీ మరియు యూఏఈ దేశాల మీదుగా అధికారుల కళ్లు గప్పి సరఫరా చేసినట్లు ఆధారాలు లభించాయి.

కీలకమైన ఫోన్ రికార్డులు.. 20 ఏళ్ల జైలుశిక్ష?

షమీమ్ మాఫీ 2013లో ఇరాన్ నుంచి అమెరికాకు వలస వచ్చి 2016లో గ్రీన్ కార్డ్ పొందింది. దర్యాప్తులో భాగంగా 2022 డిసెంబర్ నుంచి 2025 జూన్ వరకు ఆమె ఇరాన్ అధికారులతో నేరుగా జరిపిన ఫోన్ సంభాషణలు, డిజిటల్ సాక్ష్యాలను అధికారులు కోర్టుకు సమర్పించారు. తాను ఎప్పుడూ మధ్యవర్తిత్వం వహించలేదని ఆమె బుకాయించినప్పటికీ, లభించిన ఆధారాలు ఆమె నేరాన్ని బలపరుస్తున్నాయి. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే, అమెరికా ఆంక్షలను ధిక్కరించి జాతీయ భద్రతకు ముప్పు తెచ్చినందుకు ఆమెకు దాదాపు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు