మోదీ ప్రసంగాలకు తమిళనాడులో క్రేజ్: చెన్నైలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ హిందీ ప్రసంగాలను తమిళనాడు ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్రిభాషా సూత్రానికి తాము కట్టుబడి ఉన్నామని, ప్రపంచ స్థాయిలో రాణించాలంటే మాతృభాషతో పాటు ఇతర భాషలు నేర్చుకోవడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళ ప్రజలపై హిందీని ఎవరూ రుద్దడం లేదని, వారు స్వచ్ఛందంగానే నేర్చుకుంటున్నారని స్పష్టం చేశారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ, “మీకు నచ్చినా నచ్చకపోయినా, ఈ ఎన్నికల్లోనే కాదు ఆ తదుపరి ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారు” అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంస్కరణల పట్ల మోదీ నాయకత్వంపై ప్రజల్లో బలమైన నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్‌లో పోటీ పడాలంటే సంకుచిత మనస్తత్వం నుంచి బయటకు రావాలని, మాతృభాషను గౌరవిస్తూనే అంతర్జాతీయ అవకాశాల కోసం జర్మన్, జపనీస్ వంటి భాషలను కూడా ప్రోత్సహించాలని సూచించారు.

భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విశిష్ట సంస్కృతి, ఆహారపు అలవాట్లు ఉంటాయని.. అవి దేశానికి బలమని చెప్పారు. “ఆంధ్రలో పెసరట్టు, హైదరాబాద్ బిర్యానీ ఎలాగో.. చెన్నై వస్తే నేను ఇడ్లీ సాంబార్‌ను అంతే ఇష్టంగా తింటాను” అని తన వ్యక్తిగత అభిరుచులను పంచుకున్నారు. పాత కాలపు సిద్ధాంతాల కంటే ఇప్పుడు ‘టూరిజం’ మాత్రమే ప్రధానమైన ఇజం అని వ్యాఖ్యానించిన ఆయన, మార్పుకు అనుగుణంగా అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు