ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు (VOA) ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుమారు 27,336 మంది వీవోఏలకు సంబంధించి ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న రూ. 22.67 కోట్ల ప్రోత్సాహక బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ సంఘాల సహాయకులకు భారీ ఊరట లభించనుంది.
స్త్రీ నిధి ద్వారా అందజేసే ఈ నిధుల పంపిణీకి సంబంధించి మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. స్వయం సహాయక సంఘాల (SHGs) నుంచి వసూలైన వడ్డీ ఆధారంగా వీవోఏలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని 0.75 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే స్త్రీ నిధి ద్వారా 0.25 శాతం ప్రోత్సాహకాలు అందుతుండగా, తాజా నిర్ణయంతో పెరిగిన లబ్ధి నేరుగా గ్రామ సంఘాల ఖాతాల్లో జమ కానుంది. ఇది వీవోఏల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో తోడ్పడనుంది.
గ్రామ స్థాయిలో స్త్రీ నిధి రుణాల వసూలు మరియు మహిళా సంఘాల బలోపేతంలో వీవోఏలు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని త్వరగా అందించాలనే లక్ష్యంతోనే ఈ బకాయిలను విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీవోఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









