పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం, గుడ్ల వినియోగంపై నిషేధం విధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై బీజేపీ నాగాలాండ్ నాయకుడు తెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఘాటుగా స్పందించారు. తాను స్వయంగా మాంసాహారిని అని, దశాబ్దాలుగా బీజేపీలోనే కొనసాగుతున్నానని పేర్కొంటూ ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మమతా బెనర్జీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా తెమ్జెన్ ఒక హోటల్‌లో మాంసాహార వంటకాలు ఉన్న ప్లేట్ ముందు కూర్చుని ఉన్న వీడియోను షేర్ చేశారు. “మమతా దీదీ, నేను బీజేపీలోనే ఉన్నాను మరియు నేను మాంసాహారం తింటాను” అనే క్యాప్షన్‌తో ఆయన ఈ వీడియోను పోస్ట్ చేశారు. బీజేపీ ఆహారపు అలవాట్లపై ఎలాంటి ఆంక్షలు విధించదని, మమతా బెనర్జీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా సూటిగా స్పష్టం చేశారు.
బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బెంగాలీల ప్రధాన ఆహారమైన చేపలు, అన్నంపై బీజేపీ కన్నేసిందని, వారు అధికారంలోకి వస్తే నాన్-వెజ్‌ను నిషేధిస్తారని ఆరోపించారు. అయితే, ఈ ప్రచారాన్ని బీజేపీ నేతలు మొదటి నుంచీ ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా తెమ్జెన్ చేసిన ఈ సరదా మరియు వ్యంగ్యపూరిత కౌంటర్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.









