తెలంగాణ రాజకీయ చరిత్రలో 2019లో జరిగిన ఆర్టీసీ సమ్మె ఒక పెను సంచలనంగా నిలిచింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సుమారు 48 వేల మంది కార్మికులు 52 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లో చేరని వారందరూ తమంతట తామే ఉద్యోగాల నుంచి ‘సెల్ఫ్ డిస్మిస్’ అయినట్లు ప్రకటించి, ఆర్టీసీలో కేవలం 1,200 మంది మాత్రమే మిగిలారని సంచలన ప్రకటన చేశారు.
సమ్మె కాలంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపించింది. సుదీర్ఘంగా సాగిన ఈ పోరాటంలో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనతో సుమారు 25 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం లేదా గుండెపోటుతో మరణించడం రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ వివాదం హైకోర్టుకు చేరినప్పటికీ, ప్రభుత్వం చర్చలకు మొగ్గు చూపకపోవడంతో చివరకు కార్మిక సంఘాలు ఎటువంటి షరతులు లేకుండా సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి.
సమ్మె విరమణ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య కేసీఆర్ తన వైఖరిని మార్చుకున్నారు. “కార్మికులు నా బిడ్డలు” అని పేర్కొంటూ వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. అనంతరం ప్రగతి భవన్‌లో కార్మికులతో కలిసి భోజనం చేసి, ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యతను వారికే అప్పగించారు. అలా ఒక తీవ్రమైన రాజకీయ మరియు కార్మిక పోరాటం ఊహించని రీతిలో సుఖాంతమైంది. ఆ నాటి పరిణామాలు ప్రస్తుత సమ్మె నేపథ్యంలో మళ్ళీ చర్చనీయాంశమవుతున్నాయి.









