మరో భారీ ప్రాజెక్ట్….

ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఏర్పాటు చేయనున్న క్లీన్ ఎనర్జీ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,100 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఈ ప్రాజెక్టులో భాగంగా రూ. 4,200 కోట్ల వ్యయంతో 6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్‌ను, అలాగే మరో రూ. 1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. రాబోయే రెండేళ్లలో ఈ పనులు పూర్తి కానున్నాయి. క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ మెగా ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇప్పటికే ఆర్సెలార్ మిట్టల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు వరుస కడుతుండగా, ఇప్పుడు రెన్యూ ఎనర్జీ రాకతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా మరింత బలోపేతం కానుంది. ఇదే సంస్థ భవిష్యత్తులో అనంతపురం జిల్లాలో సుమారు రూ. 22,000 కోట్లతో మరో భారీ హైబ్రిడ్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చంద్రబాబు నాయుడు పర్యటన కోసం అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు