ప్రకాష్ రాజ్‌ను చంపేస్తే ఏ1 ముద్దాయిగా ఉంటా: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!

నటుడు ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల శ్రీరాముడు, రామాయణ ఘట్టాలపై ప్రకాష్ రాజ్ చేసిన సెటైరికల్ వ్యాఖ్యలను శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో, ప్రకాష్ రాజ్‌ను ఎవరైనా చంపితే ఆ హత్య కేసులో ఏ1 ముద్దాయిగా ఉండేందుకు తాను సిద్ధమంటూ ఆయన చేసిన సంచలన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.

ప్రకాష్ రాజ్ ప్రధానమంత్రిని విమర్శించే క్రమంలో పవిత్ర రామాయణాన్ని, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడిని అవమానపరచడం సహించరాని నేరమని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. హిందూ మతాన్ని, ధర్మాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని, ప్రకాష్ రాజ్ ఒక “అర్బన్ నక్సలైట్” అని ఆయన అభివర్ణించారు. హిందూ ధర్మంపై ఎక్కడ జోకులు వేసినా వెంటాడి, వేటాడతామని, ప్రకాష్ రాజ్ షూటింగ్‌లు ఎక్కడ జరిగినా అడ్డుకుంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఈ వివాదం నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్‌ను పూర్తిగా బహిష్కరించాలని అగ్ర హీరోలు, నిర్మాతలను శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇది “నయా భారత్” అని, ఇక్కడ సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా, బీజేపీ నేత చేసిన ఈ తాజా వ్యాఖ్యలు శాంతిభద్రతల పరంగా కూడా చర్చకు దారితీస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు