ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్ధతిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ పనులను వేగవంతం చేస్తూ నెల రోజుల్లోగా టెండర్లు దక్కించుకున్న సంస్థలకు పనులు అప్పగించి, నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తొలి విడతలో భాగంగా పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని ప్రాంతాల్లో వైద్య కళాశాలల పనులు మొదలుపెట్టాలని స్పష్టం చేశారు.
వైయస్ జగన్ నియోజకవర్గమైన పులివెందులలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీకి మౌలిక వసతుల కొరత కారణంగా గతంలో అనుమతులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కాలేజీకి ప్రాధాన్యతనిస్తూ, అత్యాధునిక సౌకర్యాలతో పనులను పూర్తి చేయాలని భావిస్తోంది. మొదటి దశలో నాలుగు కాలేజీలను పూర్తి చేశాక, రెండో విడతలో భాగంగా అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం కాలేజీల నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే, పీపీపీ విధానాన్ని ప్రధాన విపక్షం వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విధానం వల్ల ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ పరమవుతాయని, పేదలకు ఉచిత వైద్యం అందకుండా పోతుందని ఆరోపిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణకు దిగింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. కాలేజీలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని, కేవలం ప్రమాణాలు పెంచేందుకు మరియు సీట్ల సంఖ్యను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చింది. రాబోయే ఐదేళ్ల కోసం ‘ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ 2026-31’ తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు.









