తెలంగాణను వంద శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా 45 ఏళ్లు దాటిన వారిలో నిరక్షరాస్యతను పోగొట్టేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించడమే కాకుండా, విద్యా సంస్కరణలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. దీని ఫలితంగా 2025-26 విద్యా సంవత్సరంలో ఏకంగా 6.31 లక్షల మంది వయోజనులు అక్షరాస్యత పరీక్షలకు హాజరై సరికొత్త రికార్డు సృష్టించారు. నిధుల వినియోగంలో కూడా తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది.
పాఠశాల స్థాయిలో కూడా బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలను (Academic Panel Inspection Teams) రంగంలోకి దించింది. క్షేత్రస్థాయిలో ఈ బృందాల పరిశీలన మరియు ఆధునిక బోధనా పద్ధతుల వల్ల గతంలో 48 శాతంగా ఉన్న బోధన సామర్థ్యం ప్రస్తుతం 68 శాతానికి చేరుకుంది. పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఈ విధానం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలువుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తోంది.
చిన్ననాటి నుంచే విద్యార్థులకు భాష మరియు గణితంపై పట్టు సాధించేలా ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ’ (FLN) కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. దీనివల్ల తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం గణనీయంగా మెరుగుపడటమే కాకుండా, గణితంలో కూడా 30 శాతం వృద్ధి నమోదైంది. సమగ్ర శిక్షా నిధులను 84 శాతం మేర సమర్థవంతంగా వినియోగించి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి పైసాను ఖర్చు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.









