హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత: భారత్‌కు వస్తున్న నౌకను సీజ్ చేసిన ఇరాన్.. హాలీవుడ్ రేంజ్ ఛేజింగ్ వీడియో విడుదల!

పశ్చిమాసియాలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. దుబాయ్ నుండి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వస్తున్న ‘ఎపామినోండాస్’ అనే వాణిజ్య నౌకతో పాటు మరో ట్యాంకర్‌ను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బుధవారం స్వాధీనం చేసుకుంది. ఈ నౌకలు తమ హెచ్చరికలను పట్టించుకోలేదని, నావిగేషన్ వ్యవస్థలను ఏమార్చి నిబంధనలను ఉల్లంఘించాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇరాన్ అధికారిక టెలివిజన్ విడుదల చేయగా, అది హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా ఉండటం గమనార్హం.

ఇరాన్ విడుదల చేసిన వీడియోలో మాస్క్‌లు ధరించిన కమాండోలు స్పీడ్ బోట్ల ద్వారా నౌకలను వెంబడించడం, ఆయుధాలతో డెక్‌పైకి ఎక్కడం స్పష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు ఇరాన్ సైన్యం నౌకపై కాల్పులు జరిపి, గ్రనేడ్లు విసరడంతో నౌకలోని సెంట్రల్ కమాండ్ సెంటర్ దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే, ఈ దాడిలో నౌకలోని సిబ్బందికి ఎటువంటి ప్రాణాపాయం కలగలేదని, అందరూ క్షేమంగానే ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. అమెరికా విధిస్తున్న దిగ్బంధనాల మధ్య ఇరాన్ ఇలాంటి సాహసోపేత చర్యలకు దిగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

ఈ పరిణామం భారత్ మరియు ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత రెండు రోజుల క్రితమే భారత జెండా ఉన్న మరో నౌకపై ఇరాన్ కాల్పులు జరపడంతో, భారత ప్రభుత్వం ఇప్పటికే ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసి నిరసన వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై మరియు భారత వాణిజ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతాయోనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు