అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.5,400 కోట్ల విలువైన ‘రెన్యూ ఎనర్జీ’ ప్లాంట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆస్తుల కోసం సొంత మనుషులను సైతం కడతేర్చే ‘కిల్లర్ పార్టీ’ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శుభకార్యాలు జరిగే రోజుల్లో కూడా ఇలాంటి దుర్మార్గుల గురించి ప్రజలను హెచ్చరించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లాను రాబోయే రోజుల్లో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ఏపీకి తిరిగి పెట్టుబడులు వస్తున్నాయని, ఈ నెల 28న గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు కూడా శంకుస్థాపన చేయబోతున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రకృతి వనరులను దోచుకుంటే, తమ ప్రభుత్వం వాటిని సంపదగా మారుస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు.
విద్యుత్ రంగంపై స్పందిస్తూ.. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రజలపై పడిన రూ.32 వేల కోట్ల భారాన్ని తమ ప్రభుత్వమే భరిస్తోందని, ఎన్నికల హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని, భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నీ ఈవీ బస్సులుగా మారుస్తామని తెలిపారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్ర’ సాధించడమే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.








