తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రముఖ కోలీవుడ్ నటుడు వీటీవీ గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని నందనం ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన, తాను నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీకే ఓటు వేసినట్లు బహిరంగంగా ప్రకటించారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎవరికి ఓటు వేశారో రహస్యంగా ఉంచుతారు, కానీ గణేష్ మాత్రం విజయ్ మీద ఉన్న నమ్మకంతో నేరుగా వెల్లడించడం చర్చనీయాంశమైంది.
సమాజాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి విజయ్ సరైన వ్యక్తి అని, ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని గణేష్ ధీమా వ్యక్తం చేశారు. విజయ్ ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకం తనకు ఉందని, టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన పేర్కొన్నారు. మే 4న వెలువడనున్న ఫలితాల కోసం వేచి చూడాలని, అప్పటికి విజయ్ గెలుపు ఖరారు అవుతుందని ఆయన ధీమాగా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో “ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావ్” అనే మీమ్స్‌తో వైరల్ అవుతోంది.
మరోవైపు తమిళనాడు అంతటా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలకే సుమారు 70 శాతం ఓటింగ్ నమోదైంది. సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్ కుమార్, కమల్ హాసన్, శ్రుతి హాసన్, త్రిష వంటి దిగ్గజ సెలబ్రిటీలు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయ్ స్వయంగా ఈసారి ఎన్నికల బరిలో ఉండటంతో ఫలితాలపై భారీ ఉత్కంఠ నెలకొంది. మే 4న జరగనున్న కౌంటింగ్‌లో తమిళనాడు ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో తేలనుంది.








