- అసమానతల విద్యా విధానం ప్రమాదకరం.
- జాతీయ విద్యా విధానం 2020 అమలు సరికాదు.
- రాష్ట్ర విద్యా కమిషన్ సిఫారసులు సమీక్షించాలి.
- టిపిటిఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయండి.
- టిపిటిఎఫ్ రాష్ట్ర అకడమిక్ సెల్ సభ్యులు మునిగడప రామాచారి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 24
టుడే నైన్ ప్రతినిధి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అసమానతల విద్యా విధాన ప్రభావంతో సమాజంలో అంతరాలు ఏర్పడుతున్నాయని, ఈ విధానాలు దేశ సమగ్రాభివృద్ధికి ప్రమాదకరమని, ప్రజలందరికీ సమానమైన నాణ్యమైన ఉచిత విద్య అందించడం ప్రభుత్వాల బాధ్యత అని అందుకోసం జరిగే ఉద్యమాలలో మనం మన వంతు పాత్ర పోషించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) అకడమిక్ సెల్ సభ్యులు మునిగడప రామాచారి అన్నారు. స్థానిక ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి ఈ నెల 30న హైదరాబాదులో జరిగే విద్యా సదస్సు గోడ పత్రికలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ… విద్యారంగ నిర్వహణను కేంద్రం తన చేతిలోకి తీసుకొని రాష్ట్రాల ప్రతిపత్తి ప్రజాస్వామిక రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇవ్వడం సరికాదని, విభిన్న భాషలు సంస్కృతులు సాంప్రదాయాలు భౌగోళిక భిన్నత్వాలు కలిగిన భారతదేశంలో ఒకే కరికులం ఒకే పరీక్ష ఒకటే విధానం అనడం కేంద్ర ప్రభుత్వ ఆదిపత్యం అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్లకు పైబడి విద్యారంగం పూర్తిగా విధ్వంసానికి గురైందని, ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత పాలక పార్టీ సైతం గత ప్రభుత్వం యొక్క బాటలోనే విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. విద్యా కమిషన్ సిఫారసుల ద్వారా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఒకవైపు ముఖ్యమంత్రి స్వీయ ఆలోచన అంటూ యంగ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీలు మరొకవైపు, ఉన్నత స్థాయి హైపవర్ విద్యా కమిటీ ఏర్పాటు అంటూ ఇంకొక వైపు విద్యారంగాన్ని గందరగోళ పరిస్థితులు ఉన్నాయని, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా కనపడటం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో ఉదయం 10 గంటల నుండి జరిగే రాష్ట్ర విద్యా సదస్సుకు ముఖ్యఅతిథిగా పాఠశాల విద్యా సంచాలకులు ఇ.నవీన్ నికోలస్ ఐఏఎస్, గౌరవ అతిధిగా ప్రొఫెసర్ ఎం.కోదండరాం విద్యారంగ మేధావులు ప్రొఫెసర్ జి.హరగోపాల్, ప్రొఫెసర్ చింతకింద కాశీం, ఆంధ్రజ్యోతి పూర్వ ఎడిటర్ కె.శ్రీనివాస్ తదితరులు హాజరై విద్యావిషయక అంశాలపై చర్చించనున్నారని, ఉపాధ్యాయులు, విద్యాభిమానులు, విద్యార్థులు, యువజనులు, సామాజిక కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బి.ప్రకాష్ రావు, మండల కమిటీ సభ్యులు పి.రాంబాబు, రఘునందన్ సింగ్, జి.మోహన్, బి.వీరన్న, రాజేష్, జనార్ధన్, రమేష్, సురేష్, శ్రీను, జి.వీరన్న లు పాల్గొన్నారు.









