దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు రాహుల్ మీనాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో బాధిత కుటుంబం వద్దే పనివాడిగా ఉన్న ఈ యువకుడు, కేవలం డబ్బు, నగలు దొంగిలించే ఉద్దేశంతోనే ఇంట్లోకి ప్రవేశించానని, హత్య చేయాలనే ఆలోచన తనకు లేదని పోలీసుల విచారణలో వెల్లడించాడు. “ఆమె డబ్బులిచ్చి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు.. నేను చంపాలనుకోలేదు, కానీ అలా జరిగిపోయింది” అని అత్యంత నిర్లక్ష్యంగా, ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా సమాధానమిచ్చాడు.
అప్పులు చేశాడన్న కారణంతో నెల క్రితం పనిలోంచి తీసివేయబడిన రాహుల్.. రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి క్యాబ్‌లో ఢిల్లీకి చేరుకున్నాడు. మాజీ యజమాని ఇంటి నిర్మాణం, వారి దినచర్యపై పూర్తి అవగాహన ఉండటంతో ముందుగానే సంపాదించిన అదనపు తాళంచెవితో నేరుగా ఇంట్లోకి చొరబడ్డాడు. టెర్రస్ పై ఉన్న స్టడీ రూమ్‌లో ఉన్న అధికారి కుమార్తె వద్దకు వెళ్లి డబ్బు డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించి, కేకలు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో టేబుల్ ల్యాంప్‌తో ఆమె ముఖంపై తీవ్రంగా దాడి చేశాడు. అనంతరం మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌తో గొంతు నులిమి, ఆమె అపస్మారక స్థితిలో ఉండగా అత్యంత అమానుషంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ కిరాతకానికి పాల్పడిన అనంతరం, బాధితురాలిని లాకర్ ఉన్న గదిలోకి లాక్కెళ్లాడు. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన ఆమె రక్తపు వేలిముద్రలతో బయోమెట్రిక్ లాకర్ తెరిచేందుకు విఫలయత్నం చేశాడు. అది సాధ్యపడకపోవడంతో చివరకు స్క్రూడ్రైవర్‌తో లాకర్‌ను పగలగొట్టి నగదు, నగలు దొంగిలించి, రక్తపు మరకలున్న తన దుస్తులు మార్చుకుని అక్కడినుంచి పరారయ్యాడు. పోలీసుల విచారణ సమయంలో నిందితుడిలో కించిత్ విచారం కానీ, భయం కానీ కనిపించలేదని, అత్యంత ప్రశాంతంగా తన వాంగ్మూలాన్ని ఇస్తున్న తీరు చూసి విచారణాధికారులే విస్మయానికి గురయ్యారని తెలిసింది.









