సింగపూర్‌లోని మెరీనా బ్యారేజీని పరిశీలించిన ఏపీ మంత్రుల బృందం.. కృష్ణా తీరంలో అమలుపై దృష్టి

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని అత్యంత ఆధునిక హంగులతో, ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఏపీ మంత్రుల బృందం తాజాగా అక్కడి ప్రతిష్టాత్మక మెరీనా బ్యారేజీని సందర్శించింది. వరద నియంత్రణ, త్రాగునీటి సరఫరాతో పాటు పర్యాటకాన్ని ఒకేచోట అద్భుతంగా మేళవించిన ఈ బృహత్తర ప్రాజెక్టు నిర్మాణ శైలి, నిర్వహణ విధానాలను మంత్రులు క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేశారు.

ఈ సింగపూర్ పర్యటనలో నాలుగో రోజు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు ఈ బ్యారేజీని సందర్శించారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా నీటి సమస్యలను అధిగమించే విధానాలను వారు అడిగి తెలుసుకున్నారు. గ్రీన్ రూఫ్ లాంటి పర్యావరణ హితమైన కట్టడాలతో దీనిని ఒక ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా ఎలా అభివృద్ధి చేశారనే విషయాలను నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సిటీస్ డైరెక్టర్ ఖూ టెంగ్ చై మంత్రుల బృందానికి సోదాహరణంగా వివరించారు.

ఈ అధ్యయన పర్యటన అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ, సింగపూర్‌లోని మెరీనా బ్యారేజ్ మోడల్ తమకు ఎంతగానో స్ఫూర్తిదాయకంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో, కృష్ణా నది తీరాన కూడా సరిగ్గా ఇటువంటి ఆధునిక అభివృద్ధి నమూనాలను, పర్యాటక ప్రాజెక్టులను అమలు చేసే అవకాశాలపై తమ బృందం సుదీర్ఘంగా చర్చించినట్లు ఆమె వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు