నేరగాళ్లతో పోరాడటం నాకు కొత్తే.. వైసీపీ ఒక కిల్లర్ పార్టీ: సీఎం చంద్రబాబు

తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సైద్ధాంతిక, రాజకీయ పోరాటాలు చేశానని, కానీ నేరగాళ్లతో పోరాడాల్సిన పరిస్థితి రావడం తనకు కొత్తగా ఉందని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇంఛార్జ్‌ల శిక్షణా తరగతుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

వైసీపీని ఒక ‘కిల్లర్ పార్టీ’గా అభివర్ణించిన చంద్రబాబు.. ఆ పార్టీ నేతలు సొంత మనుషులనే చంపుకునే స్థాయికి దిగజారారని విమర్శించారు. ప్రభుత్వ భూముల పంపకాల్లో తేడాలు రావడంతో కడపలో సొంత పార్టీ కార్యకర్త దస్తగిరినే హతమార్చారని ఆరోపించిన ఆయన.. నేరాలు వారు చేసి ఆ నెపాన్ని ఇతరులపై నెట్టేందుకు కుట్రలు పన్నుతారని మండిపడ్డారు. అలాగే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు తీరును ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. వైసీపీ అరాచక ఆలోచనా విధానాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు నిత్యం గుర్తుచేయాలని, అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న మంచిని వారికి వివరించాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీ కార్యకర్తలను కాపాడుకున్నానని, టీడీపీలో కార్యకర్తలే నిజమైన అధినేతలని ఆయన కొనియాడారు. ప్రతి కార్యకర్త రైట్ రాయల్‌గా బతకాలని, పార్టీ ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని నాయకులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు