ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో జరిగిన ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన ఎక్స్‌లెన్స్ అవార్డుల వేదికపై, పాలనా సంస్కరణల్లో ఆయన చూపిన చొరవకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అవార్డు స్వీకరించిన అనంతరం చంద్రబాబు ప్రసంగిస్తూ.. పేదరిక నిర్మూలనకు తాము ప్రవేశపెట్టిన P4 (Public Private People Partnership) పథకం ఒక గేమ్ ఛేంజర్ అని అభివర్ణించారు. ఈ పథకం ద్వారా లక్ష మంది మార్గదర్శకులు, 10 లక్షల మందిని దత్తత తీసుకుని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని ఆయన వివరించారు. సమాజంలో లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
అభివృద్ధికి టెక్నాలజీయే ప్రధాన చోదక శక్తి అని, సాంకేతికతను అందిపుచ్చుకుని యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. తాను గతంలో అమలు చేసిన ‘విజన్ 2020’ ఫలితాలను నేడు హైదరాబాద్ అభివృద్ధి రూపంలో చూస్తున్నామని ఆయన గుర్తు చేశారు. సంస్కరణల పట్ల నిబద్ధతతో ఉంటేనే భవిష్యత్ తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించగలమని, అదే స్ఫూర్తితో ఏపీని కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.









