బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత తన కొత్త పార్టీని ప్రకటించడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదని ఆయన కొట్టిపారేశారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పన్నెండేళ్లుగా అందిస్తున్న అవినీతిరహిత పాలనే తమకు శ్రీరామరక్ష అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కవిత కొత్త పార్టీ పేరును ఉద్దేశించి రామచందర్ రావు ఎద్దేవా చేశారు. గతంలో టీఆర్ఎస్ (TRS) కాస్తా బీఆర్ఎస్ (BRS) అయిందని, ఇప్పుడు వారి బిడ్డ పెట్టిన పార్టీ కూడా మళ్ళీ టీఆర్ఎస్ (TRS – Telangana Republic Samithi) పేరుతోనే రావడం హాస్యాస్పదమని చురక అంటించారు. తెలంగాణ రాజకీయాల్లో చాలామంది పార్టీలు పెడుతున్నారని, అందులో కేఏ పాల్ లాంటి వారు కూడా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్ని సమీకరణలు మారినా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో కేవలం బీజేపీ మాత్రమే అవినీతికి తావులేని పాలనను అందిస్తోందని, ప్రజలు కుటుంబ పాలన పట్ల విరక్తితో ఉన్నారని రామచందర్ రావు విమర్శించారు. కవిత కొత్త పార్టీ కేవలం రాజకీయ మనుగడ కోసమే తప్ప, ప్రజా ప్రయోజనాల కోసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు బీజేపీలోకి వస్తారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.









