తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది మొత్తం 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల విడుదలతో పాటు, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫెయిలైన విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని కోల్పోకుండా ఉండేందుకు జూన్ 5వ తేదీ నుండి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకారం, జూన్ 5 నుండి జూన్ 12 వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుంది. ఈ పరీక్షలకు హాజరుకావాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 30 నుండి మే 14వ తేదీ లోపు సంబంధిత పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తదుపరి తరగతులకు వెళ్లేందుకు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.
ఫలితాల పట్ల అసంతృప్తిగా ఉన్న లేదా మార్కులపై సందేహం ఉన్న విద్యార్థుల కోసం రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఒక సబ్జెక్టుకు ₹500 ఫీజు చెల్లించాలి. అలాగే, జవాబు పత్రాల రీవెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఒక సబ్జెక్టుకు ₹1,000 ఫీజుగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.









