తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. మెజార్టీ విశ్లేషణా సంస్థలు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే (DMK) కూటమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి. స్టాలిన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, పాలనపై ప్రజలు మొగ్గు చూపారని, అన్నాడీఎంకే ప్రతిపక్షానికే పరిమితమవుతుందని మెజార్టీ సర్వేలు వెల్లడించాయి. అయితే, ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ గణనీయమైన ప్రభావం చూపుతుందని దాదాపు అన్ని సంస్థలు అంగీకరించాయి.
ఎగ్జిట్ పోల్స్ వివరాలను పరిశీలిస్తే, మ్యాట్రిజ్, పీపుల్స్ పల్స్, పీ-మార్క్ వంటి సంస్థలు డీఎంకే కూటమికి 122 నుండి 145 స్థానాలు దక్కుతాయని అంచనా వేశాయి. విజయ్ పార్టీకి కేవలం 10 నుండి 40 లోపు సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఆ పార్టీ మూడో శక్తిగా ఎదుగుతుందని ఇవి పేర్కొన్నాయి. కానీ, ఇండియా టుడే – మై యాక్సిస్ సర్వే మాత్రం విభిన్నమైన జోస్యం చెప్పింది. తమిళనాడులో ‘విజయ్ సునామీ’ రాబోతోందని, టీవీకే పార్టీ 98 నుండి 120 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని ఈ సర్వే అంచనా వేయడం విశేషం.
అసలు ఫలితాలు మే 4న వెలువడనుండగా, అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగనుంది. ఒకవేళ విజయ్ పార్టీకి అంచనా వేసినట్లుగా సీట్లు వస్తే, తమిళ రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత కాలం నాటి ద్విధ్రువ రాజకీయాలకు తెరపడి సరికొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్ పార్టీ శ్రేణులు తమ అధినేత కాబోయే ముఖ్యమంత్రి అంటూ క్యాబినెట్ కూర్పుపై కూడా కసరత్తులు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, తమపై ఉన్న ప్రజాధరణతో విజయం తమదేనని డీఎంకే ధీమా వ్యక్తం చేస్తోంది.
మీరు ఎవరి విజయాన్ని ఆకాంక్షిస్తున్నారు?









