ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రణ్‌వీర్ ‘ధురంధర్’.. ఇక జపాన్‌లో సందడి!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లింగ్ వండర్ ‘ధురంధర్’ (పార్ట్ 1) ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం, జులై 10న జపాన్‌లోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థలైన జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ అధికారికంగా ప్రకటిస్తూ, జపనీస్ భాషలో రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశాయి. “ఇక జపాన్ ఈ ధురంధర్ ఎనర్జీని చూసే సమయం వచ్చింది” అంటూ సినిమా టీమ్ ఉత్సాహం వ్యక్తం చేస్తోంది.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, 2025 డిసెంబర్‌లో విడుదలై అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹1,328 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, విదేశీ మార్కెట్‌లో అత్యంత విజయవంతమైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ నంబర్ 1 హిందీ చిత్రంగా రికార్డు సృష్టించడమే కాకుండా.. కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కింది.

ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, భారతదేశంపై కుట్ర పన్నుతున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదించడానికి పాకిస్థాన్‌లోని కరాచీకి వెళ్లిన ఒక అండర్‌కవర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. యదార్థ రాజకీయ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ స్పై డ్రామాలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి భారీ తారాగణం నటించారు. అంతర్జాతీయంగా ఘనవిజయం సాధించిన ఈ చిత్రం జపాన్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు