మైనర్ బాలిక అబార్షన్ కేసు: చట్టాల సవరణపై సుప్రీం కోర్టు కీలక సూచనలు

అత్యాచారానికి గురైన 15 ఏళ్ల మైనర్ బాలిక అబార్షన్ కేసులో సుప్రీం కోర్టు గురువారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా భారతీయ చట్టాల ప్రకారం 24 వారాలు దాటితే అబార్షన్‌కు న్యాయస్థాన అనుమతి తప్పనిసరి కాగా, ఈ కేసులో బాలిక 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు కోర్టు ఇటీవల అనుమతినిచ్చింది. అయితే, ఈ దశలో అబార్షన్ చేయడం వల్ల బాలిక ప్రాణాలకు ప్రమాదమని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎయిమ్స్ (AIIMS) క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ అంశంపై ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం వల్ల కలిగిన మానసిక క్షోభ ఆ బాలికను జీవితాంతం వెంటాడుతుందని, అటువంటి స్థితిలో ఆమెను బలవంతంగా గర్భాన్ని కొనసాగించమని చెప్పలేమని స్పష్టం చేసింది. ఒకవేళ అబార్షన్ వల్ల ఆమె ప్రాణాలకు ముప్పు లేదని వైద్యులు నిర్ధారిస్తే, ఆ ప్రక్రియను కొనసాగించాలని సూచించింది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని బాధితురాలు మరియు ఆమె తల్లిదండ్రులకే వదిలేస్తూ, వారికి ఎదురయ్యే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై సరైన కౌన్సెలింగ్ ఇవ్వాలని ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది.

అంతేకాకుండా, అత్యాచార బాధితుల కోసం అబార్షన్ చట్టాలను (MTP Act) సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. గర్భం దాల్చిన అత్యాచార బాధితులకు 20 వారాలు దాటిన తర్వాత కూడా అబార్షన్ చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తూ చట్టంలో మార్పులు తీసుకురావాలని పేర్కొంది. తన చదువు, జీవితం ఇప్పటికే ఈ ఘటన వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ప్రతి రోజూ తనకు నరకప్రాయంగా ఉందని బాధితురాలు కోర్టు ముందు వాపోయిన నేపథ్యంలో, ఇలాంటి బాధితులకు న్యాయస్థానాల చుట్టూ తిరిగే పని లేకుండా చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు