ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన పాడ్ కాస్ట్ ‘పూరీ మ్యూజింగ్స్’లో ‘రిజెక్షన్’ (తిరస్కారం) అనే అంశంపై తనదైన శైలిలో స్పందించారు. జీవితంలో ఎవరైనా మనల్ని కాదన్నంత మాత్రాన మన విలువ తగ్గిపోదని, అది మరో గొప్ప అవకాశం కోసం ఎదురుచూడాల్సిన సమయమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ‘స్లమ్ డాగ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న పూరీ, సామాజిక మాధ్యమాల వేదికగా యువతకు స్ఫూర్తినిచ్చేలా ఈ వ్యాఖ్యలు చేశారు.
తిరస్కారాన్ని ఒక అడ్డంకిలా కాకుండా, కొత్త ప్రారంభంలా భావించాలని పూరీ సూచించారు. “ఎవరో మిమ్మల్ని కాదన్నారంటే, అంతకంటే మెరుగైన అవకాశం మీకోసం వేచి ఉందన్నమాట. రిజెక్షన్ ఎదురైనప్పుడు కసి పెంచుకోవాలి తప్ప, కుంగిపోకూడదు” అని ఆయన వివరించారు. మన దగ్గర టాలెంట్ మరియు స్కిల్ ఉన్నంత కాలం ఎవరూ మనల్ని ఆపలేరని, ప్రతి రిజెక్షన్ మనల్ని ఒక్కో మెట్టు ఎక్కేలా చేస్తుందని ఆయన ఆత్మవిశ్వాసాన్ని నింపారు.
ఈ సందర్భంగా ఆయన ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల ఉదాహరణలను గుర్తు చేశారు. క్రియేటివిటీ లేదని న్యూస్ పేపర్ ఉద్యోగం నుంచి తీసేసిన కుర్రాడే వాల్ట్ డిస్నీ అయ్యాడని, బాస్కెట్ బాల్ టీమ్ నుంచి వెలివేయబడిన వ్యక్తే మైఖేల్ జోర్డాన్ అని, అలాగే ఓప్రా విన్‌ఫ్రే వంటి వారు కూడా ఒకప్పుడు తిరస్కరణకు గురైనవారేనని పేర్కొన్నారు. “మన శక్తి సామర్థ్యాలు మనకే సరిగ్గా తెలియనప్పుడు, ఎవరో మనల్ని జడ్జ్ చేస్తే బాధపడటం అనవసరం. మన గురించి మనకే తెలియదు.. వాడికేం తెలుసు బొంద” అంటూ తనదైన శైలిలో ముగించారు.









