అమరావతి వాసులకు అలర్ట్: రేపు మొబైల్ ఫోన్లకు అత్యవసర సందేశాలు, ఆందోళన వద్దు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని మొబైల్ వినియోగదారులకు రేపు (మే 2, శనివారం) ప్రత్యేక అత్యవసర హెచ్చరిక సందేశాలు రానున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ఆధ్వర్యంలో ‘ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్’ను ప్రయోగాత్మకముగా పరీక్షించనున్నారు. శనివారం ఉదయం 11:15 గంటల నుండి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య ఈ పరీక్షా సందేశాలు మొబైల్ ఫోన్లకు వస్తాయని, పెద్ద బీప్ శబ్దంతో వచ్చే ఈ సందేశాలను చూసి ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టం చేసింది.

ఈ పరీక్షలో భాగంగా సెల్ బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీ ద్వారా ఫోన్ స్క్రీన్‌పై ఒక ఫ్లాష్ మెసేజ్ కనిపిస్తుంది. “ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం పంపిన నమూనా పరీక్ష సందేశం.. దీనిని విస్మరించండి” అనే సమాచారం అందులో ఉంటుంది. భవిష్యత్తులో తుపానులు, వరదలు లేదా భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను తక్షణమే అప్రమత్తం చేసేందుకు ఈ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. ఈ ట్రయల్ రన్ ద్వారా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మరియు హెచ్చరికలు చేరే వేగాన్ని అధికారులు అంచనా వేస్తారు.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ వినూత్న వ్యవస్థ ద్వారా విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇంటర్నెట్ లేకపోయినా లేదా నెట్‌వర్క్ రద్దీగా ఉన్నా ఈ సందేశాలు నేరుగా ప్రజలకు చేరుతాయి. రేపు అమరావతి పరిసర ప్రాంతాల్లో జరిగే ఈ ప్రక్రియ కేవలం సాంకేతిక పరీక్ష మాత్రమేనని, దీనికి ప్రజల వైపు నుండి ఎలాంటి స్పందన లేదా చర్య అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు